Monday, November 16, 2020

శ్రీ భాగవతము- పోతన

           శ్రీ భాగవతము-

కామధేనువు వలె కామితంబులు దీర్చు
భక్తి మీర జదువ భాగవతము
కల్పవృక్షమువోలె కలిమి నొసగు నెప్డు
పాపంబు దొలగించు భాగవతము
పాలసంద్రము వోలె పావనంబై వెల్గి
భాగ్యరాశుల నిచ్చు భాగవతము
నిత్యు డౌ సత్యుడౌ నీరజాక్షుని వేడ
పాలింప జేయులే భాగవతము

రామ భక్తి గల్గి వ్రాసెను పోతన 
కృష్ణ భక్తి గల్గి కృతిని గూర్చె
రామ కృష్ణు లిలను కామిత వరదులై
పూజ లందు కొనిరి పుణ్య తములు.

             --- అంబటి భానుప్రకాశ్. 

Saturday, October 13, 2018

Saturday, January 13, 2018


.

 *సంక్రాంతి పండుగ సందడి.*


సంకురాతిరి పండుగ సంతసంబు,
సకల జనులకు భాగ్యంబు చక్కనిచ్చు,!
మురియు చుందురు ముంగిట ముగ్గుబెట్టి,
భోగి సంక్రాంతి కనుమలె భోగమౌను !!

పిండి వంటల ఘుమఘుమ పిలుపువచ్చు,
తీయ నైనట్టి మాటల తేటదనము,!
నందరొక్కటి, గూర్చుండి యందముగను,
నారగింతురు మురియుచు తీరుగాను.!!

భోగి మంటల గాల్చేరు మూగికొనుచు,
పాత వైనట్టి వస్తువు, చేతబట్టి,!
మంట లెగయగ బెట్టుచు మమతలెంచి,
కొత్త యాశల గోరెరు కూర్మిమీర! !

అమ్మ యమ్మమ్మ తాతయ్య లక్కతోడ,
పిన్ని,బాబాయి,వదినమ్మ,యన్న,యనుచు!
నత్త మామయ్య, బావని,ఆదరించ,
బంధుమిత్రుల కలయిక యందమౌను.!!

🌻🌺🌻🌺🌻🌺🌻🌺🌻🌺
అంబటి భానుప్రకాశ్.
దుప్పల్లి.వనపర్తి జిల్లా.
9948948787.
....,........,.........,......

Saturday, April 15, 2017


పల్లె.




ఆత్మీయుల పలకరింపులతో,
అనురాగాల ఊయలలూగుతూ,
చల్లని ప్రకృతి ఒడిలో
సేదదీరింది,
నాపల్లె,
నాడు.
అంతర్జాలమహిమో
ఆధునిక అవసరాల గుణమో,
పలకరింతలు లేవు,
పలవరింతే,
మారిపోతోంది పల్లె!
మరమనుషుల నిలయంగా,
నేడు.




అంబటి భానుప్రకాశ్.
9948948787.
చేనేతకు మంచి రోజు.
..............................

మంచి రోజులు వచ్చాయని,
మురిసిపోతున్నాడు నేతన్న,!
యంత్రాల యుగంలో,
సూత్రాలు వడకలేక,
మంత్రమేసినట్లు అగుడైంది జీవితం,
ఆదుకోవాల్సిన వారంతా,
అనాధగా వదిలేస్తే,
అక్కడిక్కడ అనకుండా,
ఎక్కడెక్కడో,  పనికై తిరిగి తిరిగి
అలసిపోయావా, ! నేతన్నా? 
అక్కునజేర్చుకునే కాలం,
రానేవచ్చిందని, ఆనందపడుతున్నవా,
నేతన్నా  !!
నీచేతి వలువ,
తెస్తుంది ఎంతో విలువ,
తెలుగుదనం ఉట్టిపడే
మేలిమి వస్త్రాలు నేసి,
మన్ననపొందడమే,
తప్ప,
మోసమంటూ  తెలియనివాడవు...
నిన్నాదుకునే వారు ఏదో ఒకచోట,
ఉండనేఉంటారు,
నీవు నేసిన వస్త్రాలను కొంటనే ఉంటారు.
దిగులెందుకు,ఓయన్నా,
సాగాలిక సంతోషంగా...!!
................
కవిపరిచయం.
అంబటి భానుప్రకాశ్.
ప్రభుత్వ ఉపాధ్యాయుడు.
ప్రభుత్వ ఉన్నత పాఠశాల. బుర్దపేట గద్వాల.
జోగులాంబ గద్వాల జిల్లా.
9948948787

Saturday, December 31, 2016




           ఉషోదయం -వస్తుంది*.


చీకటిని చూసి బాధలేదు,
ఎందుకంటే,
తిరిగితెలవారుతుందని తెలుసు.
మోడువారిన జీవితమని,
ముగించుకొని పోలేను,
ఎందుకంటే
ఎక్కడో ఓ చిన్న
ఆశ
చిగురుతొడుగుతోంది.
ప్రకృతి కోపగించి వికృతముగా
కరాళ నృత్యం చేసినా,
కష్టాలకడలిలోి హోరెత్తిన అలలు,
అలిసిపోయి నిలిచే సమయం రాదా!

అనంత భారతావని
కోటి ఆశలతో ముందుకెలుతోంది,
ఈ చీకటితొలగిపోయి,
ముదుసళ్ళకే పరితమితమైన,
ఈ పల్లెల్లో,
వెలుగులు పంచే ఉషోదయం
ముందుందని,
బాలభానుని నునులేత కిరణాలు
ప్రసరిస్తుంటే,
అనిపిస్తోంది ....
నాకూ మంచిరోజు వస్తుందని,
నేడు కాకపోతే రేపు.


31/12/2016.


Thursday, August 25, 2016

🌺🙏🌺


🌺🌺🌺🌺🌺🌺🌺
కృష్ణమ్  వందే జగద్గురుమ్.
🌸🌸🌸🌸🌸🌸🌸

సీ.
రేపల్లె వాడల్లో గోపెమ్మ వళ్ళోన,
    చక్కగా మురిసేటి చక్రినీవె,
తాపసీ జనములు తపమాచ రింపగా,
    తరియింప జేసిన తండ్రి నీవె,
భామల కనుగప్పి పాలువెన్నలు దిని,
     దొరుకక తిరిగేటి దొంగ వీవె,
నల్లనీ నగుమోము నయగార మొప్పగా,
     నమ్మికొలచువారి నందమీవె,
తే.
నమ్మి కొలిచిన వారికి సొమ్ములిచ్చి,
కొవ్వు గలిగిన వారల కొంపముంచి,
భక్తి గలిగిన వారల ముక్తినొసగి,
మమ్ము పాలించు మాతండ్రి మరువమెపుడు.
   
           అంబటి భానుప్రకాశ్.